నిజామాబాద్, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిజామాబాద్ నగరం మాలపల్లిలో గల స్టాన్రిచ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, ఆధార్ సీడిరగ్ ప్రక్రియలు నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించి, రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి స్థానికుల నుండి లభిస్తున్న స్పందన గురించి బీ.ఎల్.ఓ లను అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో ఆయా అంశాల నమోదు విషయమై బీఎల్‌ఓలకు మార్గనిర్దేశం చేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఓటరు జాబితాలో డూప్లికేషన్ పేర్లు లేకుండా జాగ్రత్తగా పరిశీలన జరపాలన్నారు. ఎవరైనా ఇతర ప్రాంతానికి తరలి వెళ్లినట్లయితే, ఆ కొత్త ప్రదేశంలోని ఏదైనా పోలింగ్ బూత్ లో పేరును నమోదు చేసుకున్నారా, లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తరువాతే జాబితా నుండి వారి పేరును తొలగించాలని తెలిపారు. ముందుగా క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి వివరాలు ఆరా తీయాలని, అయినప్పటికీ వివరాలు వెల్లడికాని పక్షంలో గరుడ యాప్ సహాయంతో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. మృతి చెందిన వారి పేర్లను కూడా నిర్ధారణ చేసుకున్న అనంతరం జాబితా నుండి తొలగించాలని సూచించారు.
18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకూడదని ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరి ఓటు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ వేర్వేరు చోట్ల ఉన్నట్లయితే నిర్ణీత ఫారం పూరించి ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి మార్పిడి చేయించాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.