నిజామాబాద్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏళ్ల తరబడి జిల్లా ప్రజలకు సేవలందించిన పాత కలెక్టర్ భవనాలను ఆగమేఘాల మీద అధికారులు కూల్చివేస్తున్నారని, అక్కడ ఏ నిర్మాణాలు చేపడుతారో ప్రజలకు తెలియజేయాలని సిపిఐ బహిరంగ లేఖ విడుదల చేసింది. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తూ బహిరంగ లేఖను సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు.
నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్ కు సమీపాన ఉన్న నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణం, ఎండిఓ కార్యాలయం, ఇతర ప్రభుత్వ శాఖల పాత భవనాలను పోలీస్ పహార మధ్య రేయింబళ్ళు కూల్చివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలం పాత కలెక్టరేట్లో కళాభారతి నిర్మిస్తామని స్వయాన ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటన సందర్బంగా ప్రకటించినట్టు ఆయన తెలిపారు.
కళాభవన్‌కు కొద్ది స్థలం మాత్రమే కేటాయించి, మిగతా స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులైన సినీ నిర్మాత దిల్‌రాజ్, యశోద ప్రైవేట్ ఆస్పత్రికి 99 సంవత్సరాలు లీజుకు ఇవ్వనున్నట్టు వార్తలు వినబడుతున్నాయని వెల్లడిరచారు. అదే నిజమైతే ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ఆలోచనను అధికారులు విరమించుకోవాలని సుధాకర్ డిమాండ్ చేశారు. ప్రజల స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకి కేటాయిస్తే జిల్లా, నగర ప్రజలు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.
క్రీడా ప్రాంగణానికి కేటాయించాలి :
ప్రస్తుతం ఉన్న పాత కలెక్టరేట్ మైదానంను విద్యార్థులందరికీ నగరంలో అందుబాటులో ఉన్నదని, గ్రౌండ్ ను క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ సూచించారు. నగర ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఉదయం, సాయంత్రం కాలినడకకు అనువుగా పార్కును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఓమయ్య, ఎండి రఫీక్ ఖాన్, బాలయ్య పాల్గొన్నారు.