రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్‌

నిజామాబాద్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.సుదర్శన్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు వెళ్లి కలెక్టర్‌కు మెమోరండం అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి లక్ష కోట్ల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్మించామన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్లో సరైన ప్రాజెక్టుగాని, మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీలు చేయకపోవడం శోచనీయమన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో లక్షల ఎకరాలలో పంటలు పండే విధంగా గుత్ప, అలీసాగర్‌ ప్రాజెక్టులు నిర్మించామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించామని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసమే పని చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్‌ కళాశాలలో యూనివర్సిటీలలో ఉపాధ్యాయులను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియమించడం విస్మరించిందన్నారు.

లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ధరణి పోర్టల్‌ లో పేదల భూములు చూపెట్టడం లేదని ఒకరి భూమి మరొకరి పేరు మీద వస్తుందని అన్నారు. ధరణి పోర్టల్‌ పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడికి పేద వాళ్లకు సామాజిక న్యాయం జరగాలని చూస్తుందన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలని 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ సమర్థించిందని తెలిపారు.

రాజ్యాంగంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఎస్సీ, ఎస్టీలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్‌ కల్పించారని, తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని, అందులో బీసీల శాతం 50 శాతం ఉంటే వారికి 23 శాతం రిజర్వేషన్‌ కల్పించడం ఏమాత్రం న్యాయమన్నారు. చత్తీస్‌ గడ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రజలకు 13 శాతం నుండి 27శాతం వరకు రిజర్వేషన్‌ పెంచిందని, కేసీఆర్‌ ఎందుకు బలహీనవర్గాల ప్రజలకు రిజర్వేషన్‌ పెంచడం లేదని ఆరోపించారు.

రాబోయే పార్లమెంట్‌ సమావేశంలో భారతదేశంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి బలహీన వర్గాల ప్రజలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్‌ పెంచాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేయబోతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు, టీపీసీసీ డెలిగేట్‌ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »