’కంటి వెలుగు’ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళిక

నిజామాబాద్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష జరిపారు.

జనవరి 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు. ఇదివరకు నాలుగు సంవత్సరాల క్రితం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పాటు కొనసాగించడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి వంద పని దినాలలోనే పూర్తి చేసేలా సూక్ష్మస్థాయి ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు.

సెలవులను మినహాయిస్తే సుమారు ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆయా జిల్లాల జనాభాను బట్టి కంటి వెలుగు శిబిరాల కోసం అవసరమైన బృందాలను పంపిస్తామని, ఇదివరకటితో పోలిస్తే ఈసారి అదనంగా 1500 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత గడువులోగా లక్ష్యం పూర్తి చేసుకునేలా కంటి వెలుగు శిబిరాలను నిర్వహించాలని, ఎక్కడ కూడా అర్ధాంతరంగా ఈ శిబిరాలు నిలిచిపోకుండా బఫర్‌ టీమ్‌ లను సైతం అందుబాటులో ఉంచాలని కలెక్టర్లకు సూచించారు.

ఏ రోజున ఏ వార్డులో, ఏ గ్రామ పంచాయతీ పరిధిలో శిబిరాలు నిర్వహించాలనే విషయమై ముందస్తుగానే పక్క ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని అన్నారు. సరైన ప్రణాళిక రూపకల్పన జరిగితే, కార్యక్రమం సాఫీగా కొనసాగేందుకు ఆస్కారం ఉంటుందని హితవు పలికారు. కంటివెలుగు శిబిరాల నిర్వహణ చేపట్టడానికి ముందే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల అధికారులను సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు.

శిబిరాల నిర్వహణకు అవసరమైన సామాగ్రితో పాటు రీడిరగ్‌ అద్దాలను ముందుగానే జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించిన రోజునే అవసరమైన వారికి రీడిరగ్‌ అద్దాలు అందజేయాలని సూచించారు. దూరదృష్టి ఉన్న వారి వివరాలను సంబంధిత యాప్‌ లో అప్లోడ్‌ చేయాలని, పక్షం రోజుల్లోపు ఆ వివరాలకు అనుగుణంగా అవసరమైన కంటి అద్దాలను జిల్లాలకు పంపించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

శిబిరం నిర్వహించిన నెల రోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర దృష్టి అద్దాల పంపిణి ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధ్యాన్యతను ఇస్తూ, రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిబిరాల విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు.

కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : అదనపు కలెక్టర్‌

జనవరి 18 నుండి చేపట్టనున్న కంటి వెలుగు శిబిరాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ కోరారు. ఈ మేరకు మున్సిపల్‌ పట్టణాలతో పాటు అన్ని గ్రామ పంచాయతీలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అదనపు కలెక్టర్‌ సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు.

18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికి కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్ష నిర్వహించేలా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. శిబిరాల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 70 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, ఒక ఆప్టోమెట్రిస్ట్‌ అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఇద్దరు ఏ.ఎన్‌.ఎం లు, ముగ్గురు ఆశా వర్కర్ల చొప్పున మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారని తెలిపారు.

ఒక్కో బృందం గ్రామ పంచాయతీ పరిధిలో 118 మందికి, అర్బన్‌ పరిధిలో 110 మందికి స్క్రీనింగ్‌ నిర్వహిస్తుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికను అనుసరిస్తూ జిల్లాలో సుమారు 8 లక్షల పైచిలుకు మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శిబిరాల ప్రారంభానికి రెండు రోజుల ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శిబిరాల నిర్వహణకు అవసరమైన వేదికలను ఎంపిక చేసి నివేదిక పంపించాలని, శిబిరాల వద్ద తాగునీటి వసతి, టెంట్లు, షామియానాలు, కుర్చీలు, టేబుళ్లు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువు లోపు కంటి వెలుగు శిబిరాలను చేపట్టి విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »