గల్ఫ్‌ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి

నిజామాబాద్‌, డిసెంబరు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్‌ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు.

భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలను ఒప్పించి హైదరాబాద్‌లో కాన్సులేట్‌ (రాయబార దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలని, హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్‌ ఏర్పాటు చేయడానికి నాలుగేళ్ల క్రితం తేది: 28.06.2018 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలియజేసిందని, హైదరాబాద్‌లో సౌదీ అరేబియా కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలని 2016 నుండి చేసిన విజ్ఞప్తులకు సౌదీ అరేబియా ప్రభుత్వం సూత్రప్రాయంగా సుముఖంగా ఉన్నట్లు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు.

‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీ కొరకు రెండేళ్ల కోసం రూ. 325 ప్రీమియం చెల్లించాలని, ఆ తర్వాత ఆన్‌లైన్‌ లో రెనివల్‌ చేసుకోవచ్చని, ఈ ఇన్సూరెన్స్‌ కేవలం ప్రమాద మరణం (యాక్సిడెంట్‌ డెత్‌) కు మాత్రమే వర్తిస్తుందని, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సహజ మరణం (నేచురల్‌ డెత్‌) కూడా కవర్‌ అయ్యేలా ఇన్సూరెన్స్‌లోని నిబంధనలు సవరించాలన్నారు. అవసరమైతే కొంచెం ప్రీమియం పెంచండి లేదా సబ్సిడీ ఇవ్వండని, ఇది గల్ఫ్‌ మృతులకు ఎంతో ఉపయోగపడే విలువైన అంశమని, గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో గల్ఫ్‌ దేశాలలో సుమారు 1,700 మంది తెలంగాణ వలస కార్మికులు మృతి చెందారన్నారు.

ఖతార్‌లో భారతీయ కార్మికుల మరణాలపై భారత ప్రభుత్వం మౌనం వీడాలని, 2010-20 మధ్య కాలంలో ఖతార్‌లో 2,711 మంది భారతీయులు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, ఫుట్‌బాల్‌ స్టేడియంలు, సంబంధిత నిర్మాణాలు, ఇతర పనులు చేసే కార్మికులు వివిధ కారణాలతో మృతి చెందారని, గత పదేళ్లలో ఖతార్‌లో దాదాపు 100 మంది తెలంగాణ వలస కార్మికులు మరణించినట్లు ఒక అంచనా, కాగా మరణానికి కారణం ఏదయినా… ఖతార్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన అందరు వలస కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు.

కోవిడ్‌ 19 కాలంలో గల్ఫ్‌ దేశాల నుండి వాపస్‌ వచ్చిన ‘వేతన దొంగతనం’ బాధితులను భారత ప్రభుత్వం ఆదుకోవాలని, గల్ఫ్‌ తదితర దేశాల నుండి తిరిగి వచ్చిన వలస కార్మికులకు వారి విదేశీ యజమానుల నుండి వారికి రావలసిన జీతం బకాయిలు, బోనస్‌, పిఎఫ్‌, గ్రాట్యుటీ (ఉద్యోగ అనంతర ప్రయోజనాలు) పొందడానికి న్యాయ సహాయం అందించండన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »