రెంజల్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సాయరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దూపల్లి గ్రామంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్, బిపి, షుగర్, రక్తపోటు గల పేషెంట్లకు ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా మందులను పంపించడం జరుగుతుందని, ఈ మందులను ఎన్సీడీ కిట్టు బ్యాగులలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా బ్యాగులో మూడుపూటలు మందులు వేసుకునేందుకు అణువుగా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
వీటి ద్వారా సులువుగా మందులను వాడుకోవడానికి అనువుగా ఉంటుందని, ప్రభుత్వం ఆరోగ్య శాఖ ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రతినెల అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయిలు, ఏఎన్ఎమ్ రాజ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ సుదర్శన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.