నిజామాబాద్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే కృత నిశ్చయంతో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నేటితో (గురువారం) ముగియనుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువు ముగిసే లోపు ఓటరు జాబితాలో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
బుధవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం గత నవంబర్ 01 వ తేదీ నుంచి ఇప్పటివరకు 27,154 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఇంకనూ మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే ఎన్ రోల్ చేసుకోవాలని సూచించారు.
సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును పొందడంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదని హితవు పలికారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు కొరకు ఫారం-6, ఏవైనా మార్పులు చేర్పులతోపాటు బదలాయింపు కోసం నిర్ణీత ఫారం-8 పూరించి సరి చేసుకోవాలని, వోటరు జాబితా నుండి తొలగించుటకు ఫారం-7 అందించాలని కలెక్టర్ సూచించారు.
ఓటరు ప్రత్యేక నమోదులో భాగంగా ఇప్పటివరకు మార్పులు-చేర్పులకు సంబంధించి 5,030 దరఖాస్తులు సమర్పించారని జిల్లా పాలనాధికారి వివరించారు. కాగా, ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులను వెంటది వెంట ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసేలా పకడ్బందీ చర్యలుచేపట్టాలని కలెక్టర్ ఈ.ఆర్.ఓలు, సహాయ ఈ.ఆర్. ఓలను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యవేక్షణ జరపాలన్నారు.
ఈ.ఆర్.ఓలు, సహాయ ఈ.ఆర్. ఓలు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆదేశించారు. ఓటర్లు ఎవరైనా ఇతర ప్రాంతానికి వలస వెళ్లినట్లయితే, ఆ కొత్త ప్రదేశంలోని ఏదైనా పోలింగ్ బూత్ లో పేరును నమోదు చేసుకున్నారా, లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తరువాతే జాబితా నుండి పేరును తొలగించాలని తెలిపారు. మృతి చెందిన వారి పేర్లను కూడా స్పష్టమైన నిర్ధారణ చేసుకున్న మీదట జాబితా నుండి డిలీట్ చేయాలని సూచించారు.
18 – 19 సంవత్సరాలు, 20 – 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓటర్ల సంఖ్యను నిర్ధారించుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, ఆర్డీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు పవన్, సంతోష్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.