కామారెడ్డి, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండల కేంద్రానికి చెందిన ఇందిర (45) కి ఆపరేషన్ నిమిత్తము బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో అన్నారం గ్రామానికి చెందిన రాజమౌళి మానవతా దృక్పథంతో స్పందించి శుక్రవారం వి.టి. ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉదయ్ కుమార్ కాలేజ్ ఆఫ్‌ఎడ్యుకేషన్-హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బయ్యారపు సురేందర్ వర్మ, రెడ్ క్రాస్, తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ నిర్వాహకులు డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్నిదానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, డబ్బుతో కొనలేనిది కేవలం రక్తం మాత్రమేనని మంచి మనసున్న మనుషులు ముందుకు వచ్చినప్పుడే ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, ప్రాణాపాయ స్థితిలో వ్యక్తులు బాధపడుతూ ఉంటే వారిని కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిపై ఉందని అన్నారు.
నాకెందుకులే అని అనుకుంటే వారి ఇంట్లో కూడా భవిష్యత్తులో రక్తం అవసరమైనప్పుడు ఇవ్వడానికి ఎవ్వరు కూడా ముందుకు రారన్నారు.నిస్వార్ధంగా రక్తదానానికి ముందుకొచ్చిన రక్తదాతకు కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున,తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యా విభాగానికి చెందిన శివశంకర్, మహేష్ గౌడ్, టెక్నీషియన్లు యేసు గౌడ్ తదితరులున్నారు.