వేములవాడ, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొఘుల్ కాలంలో ఆఖరి చక్రవర్తి ఔరంగ జేబు రాజ్య విస్తరణకు ప్రజలపై వివిధ రకాల రూపంలో పన్నులు అంటే జుట్టు పెంచుకుంటే పన్ను కట్టేలా జిజియా పన్ను విధించారని, అదే పరిస్థితి వేములవాడలో కొనసాగుతుందని విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాలు తీసుకుంటే రూ. 251 పెంచడం పేద భక్తులను నిలువు దోపిడీ చేయడమేనని, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఎక్కువ సంఖ్యలో పేద మధ్యతరగతి భక్తులే వస్తుంటారని, వారికి కనీస మౌళిక వసతులు ఏర్పాటు చేయకపోగా వివిధ రూపంలో భక్తులను పీడిరచడం ముమ్మాటికి భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని కిషోర్ అన్నారు.
దేవాలయాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని, ఇట్టి ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోక పోతే పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపడతామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా విశ్వహిందూ పరిషత్ సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు డిమాండ్ చేశారు.