నిజామాబాద్, డిసెంబరు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంట సాగుపై సమీక్ష జరిపారు.
జిల్లాలో 6000 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పాం సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 1718 ఎకరాల్లో మాత్రమే సాగుకు రైతులు ముందుకు వచ్చారని అన్నారు. వచ్చే వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిస్థాయి విస్తీర్ణంలో రైతులు ఆయిల్ పాం సాగు చేపట్టేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. సంసిద్ధత తెలిపిన రైతుల నుండి డీ.డీ లు సేకరించి జిల్లా ఉద్యానవన శాఖ అధికారికి శుక్రవారం సాయంత్రం లోగా అందించాలని ఆదేశించారు.
ఆయిల్ పాం సాగు వల్ల సమకూరే లాభాల గురించి వివరిస్తూ, రైతుల్లో నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. సాంప్రదాయ వరి సాగుతో కనీసం మూడిరతలు ఎక్కువగా స్థిరమైన పద్దతిలో ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయిల్ పాం తో పాటు అంతర పంట సాగు చేయవచ్చని సూచించారు. కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా ఆయిల్ పాం పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.
ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీని అందిస్తూ, అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోందని అన్నారు. ఆయిల్ పాం సాగుతో తప్పనిసరిగా లాభాలు సమకూరుతాయని రైతుల్లో గట్టి భరోసా కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు గట్టిగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.