పలువురు అధికారులకు మెమోలు జారీ

నిజామాబాద్‌, డిసెంబరు 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేట్‌ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి పనులను సకాలంలో పూర్తి చేయించడంలో అలసత్వం కనబర్చిన అధికారులపై కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, వెంటదివెంట బిల్లులు మంజూరు చేస్తున్నప్పటికీ నిర్ణీత గడువు లోపు ఎందుకు పనులను పూర్తి చేయడం లేదని నిలదీశారు.

పనుల ప్రగతిలో వెనుకంజలో ఉండడంతో ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌, డిప్యూటీ ఈ.ఈ భూమేష్‌, ఎడపల్లి ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఇందల్వాయి ఎంపీడీఓ రాములు కు కలెక్టర్‌ మెమోలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు – మన బడి, కంటి వెలుగు, క్రిస్మస్‌ కానుకల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరితహారం, పల్లె ప్రకృతి, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు తదితర అంశాలపై కలెక్టర్‌ సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

మన ఊరు – మన బడి కింద మొదటి విడతలో మంజూరీ తెలిపిన బడులలో పనుల ప్రగతి గురించి ఒక్కో పాఠశాల వారీగా వివరాలు ఆరా తీశారు. పనులు జరిపించడంలో వెనుకబడి ఉన్న అధికారుల పనితీరుపై కలెక్టర్‌ ఆక్షేపణ తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమైనప్పటికీ పనులను సకాలంలో పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెమోలు జారీ చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత బడులలో పెయింటింగ్‌ సహా పనులన్నీ పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. రూ. 30 లక్షల పైచిలుకు విలువ కలిగిన పనులతో పాటు, ఉపాధి హామీ కాంపోనెంట్‌ కింద మంజూరు చేసిన పనులను కూడా సత్వరమే ప్రారంభమయ్యేలా చొరవ చూపాలన్నారు. ఉపాధి హామీ పనులకు బిల్లులు ఇప్పించే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ పూర్తి భరోసా కల్పించారు. కాగా, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణ లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న ఆయా సెక్టార్ల ఎపిఎం లు, సి.సి ల పనితీరు పైనా కలెక్టర్‌ పెదవి విరిచారు.

వచ్చే వారం నాటికి 65 శాతం మేర లక్ష్యాన్ని చేరుకోవాలని, నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యంలో 75 శాతానికి పైగా బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లక్ష్య సాధనలో వెనుకబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి 18 నుండి ప్రారంభం కానున్న కంటి వెలుగు ఏర్పాట్లను సమీక్షిస్తూ, పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎపిఎంలు, మెడికల్‌ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సోమ, మంగళవారాల్లో మండల, గ్రామ పంచాయతీల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని ప్రణాళిక ఖరారు చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరు కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించుకునేలా విస్తృత ప్రచారం చేస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి, బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, గడువులోపు వీటిని పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

క్రిస్మస్‌ కానుకల పంపిణీకి ఏర్పాట్లు

క్రిస్మస్‌ వేడుకను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే క్రిస్మస్‌ కానుకలు జిల్లాకు చేరుకోగా, వాటిని ఆయా నియోజకవర్గాలకు పంపించామని, ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక నిధులను కూడా కేటాయించామని అన్నారు. సంబంధిత శాసన సభ్యులను సంప్రదించి కానుకల పంపిణీకి, క్రిస్మస్‌ విందు భోజనం నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పెషల్‌, ఆఫీసర్లు, ఎంపీడీఓలు ఆదేశించారు.

ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ హితవు పలికారు. ఈ నెల 22 వ తేదీ నాటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, మెప్మా పీ.డీ రాములు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, సీపీఓ రథం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, కార్మిక శాఖ అధికారి యోహాన్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు దేవిదాస్‌, భావన, మురళి తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »