బీజేపీకి తెలంగాణలో చోటు లేదు

ఆర్మూర్‌, డిసెంబరు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌,బీజేపీ నేత జక్కం పొశెట్టితో పాటు మరి కొందరు నాయకులు బిజెపిని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.

హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వారు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువాలు వేసి వారిని బీఆర్‌ఎస్‌ లోకి సాదరంగా ఆహ్వానించిన జీవన్‌ రెడ్డి పార్టీలో వారికి సముచిత స్థానం, రెట్టింపు గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. ముదిరాజ్‌ సంఘానికి ఫంక్షన్‌ హాలు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అబద్దాలకోరు ఎంపీ అరవింద్‌ మాయ మాటలకు మోసపోయి జక్కం పోశెట్టి తదితరులు బీజేపీ ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ సమక్షంలో ఢల్లీిలో బీజేపీలో చేరారని ఆయన అన్నారు. అయితే బీజేపీకి అంత సీన్‌ లేదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌ తోనే ముడిపడి ఉందని గ్రహించి పోశెట్టి మూడు నెలలు కూడా తిరగక ముందే తిరిగి బీఆర్‌ ఎస్‌ లో చేరడం సంతోషకరమన్నారు. కాగా జీవన్‌ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బీఆర్‌ఎస్‌ను బీసీలు, రైతుల సంక్షేమ పార్టీగా అభివర్ణించారు.

బీఆర్‌ఎస్‌ అంటే ప్రజల కోసం పనిచేసే ఒక విజన్‌. బీజేపీ అంటే ప్రజల ఉసురు పోసుకునే పాయిజన్‌. బీజేపీ ఒక సెల్లర్స్‌ పార్టీ. బీఆర్‌ఎస్‌ అంటే భారత్‌ను రక్షించే పార్టీ.
బడా జూటా బీజేపీకి తెలంగాణలో చోటు లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పేవి ఢల్లీి సుద్దులు. కానీ ఆయనవి గల్లీ బుద్ధులు. నడ్డా పుట్టిన గడ్డమీదనే చెల్లని రూపాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏం పీకలేనోడు తెలంగాణలో ఏం పీకుతాడు?. బిడ్డా..ఇది తెలంగాణ గడ్డ..కేసీఆర్‌ అడ్డా..ఇది తెలుసుకో నడ్డా కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం. బీజేపీ అంటే ఒక అమ్మకం. గుజరాత్‌ మోడల్‌ అట్టర్‌ ఫ్లాప్‌. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ మోడల్‌ సూపర్‌ హిట్‌. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కర్మ,కర్త, క్రియ అన్నీ కేసీఆరే. తెలంగాణ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు జరగాలంటే కేసీఆర్‌ నాయకత్వమే దేశానికి శరణ్యం. కేసీఆర్‌ ప్రభుత్వ పథకాల పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు.

రోజురోజుకు బీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. సబ్బండ వర్గాలూ కారు, సారు, కేసీఆర్‌ వైపే కదులుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌-1.
కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆర్మూర్‌ అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ గడ్డ బీఆర్‌ ఎస్‌ అడ్డా. ఆర్మూర్‌ నియోజకవర్గ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? ఇదే నా బహిరంగ సవాల్‌, నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల హృదయాలను దోచుకుంటున్నాయి అన్నారు.

కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్‌ లను మండలాలుగా చేయించా. ఆర్మూర్‌ను రెవెన్యూ డివిజన్‌ గా మార్పించా. ఆర్మూర్‌ అంబేద్కర్‌ చౌరస్తాను సుందరీకరించా. సిద్ధులగుట్టకు ఘాట్‌ రోడ్డు వేయించా. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పెట్టించా. రూ.8 కోట్లతో సిద్ధులగుట్టపై బీటీ రోడ్డు పనులను నిన్ననే ప్రారంభించా. తిరుపతి, యాదాద్రి మాదిరిగా సిద్ధులగుట్టను పుణ్యక్షేత్రంగా మార్చడానికి సీఎం కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో నా శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు.

ఆర్మూర్‌-నిజామాబాద్‌, ఆర్మూర్‌- ఆలూరు- ఇలా దాదాపు 9 బైపాస్‌ రోడ్లు వేయించా. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల తో మంచినీళ్లు ఇస్తున్నాం. మిషన్‌ కాకతీయ ద్వారా200 కు పైగా చెరువులు బాగు చేసినం. ఎకరానికి పది వేల చొప్పున రైతు బంధు పెట్టుబడి ఇస్తున్నాం. పంటల ను ప్రభుత్వమే కొంటున్నది. ఏ కారణం చేతనైన రైతులు మరణిస్తే రైతుబీమా ద్వారా పది రోజుల్లోగా 5లక్షల రూపాయల చొప్పున బీమా సొమ్ము ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. నియోజకవర్గంలో 60 వేల మందికి పైగా రూ.2016, రూ.3016 పెన్షలు వస్తున్నాయన్నారు.

ఒకప్పుడు పట్టుమని పది మంది పేషంట్లు కూడా లేని ఆర్మూర్‌ ఆసుపత్రిని వంద పడకలకు అప్‌ గ్రేడ్‌ చేయుంచి నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చా. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే 21,670 ఉచిత ప్రసవాలు జరిగాయి. నెలకు 400 ఉచిత ప్రసవాలు జరగాలని లక్ష్యంగా పెట్టుకొని వైద్య సిబ్బంది ముందుకు పోతున్నారు. రూ. 130 కోట్లతో పత్తేపూర్‌-చేపూర్‌- సుర్బిర్యాల్‌ లిఫ్ట్‌ చేపట్టాం అని జీవన్‌ రెడ్డి అన్నారు.

ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం కనిపిస్తున్నదని, ప్రతి పల్లెలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకూ ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని కేసీఆర్‌ ప్రభుత్వమే బాధ్యత గా తీసుకుందని ఆయన తెలిపారు. ప్రజలంతా పనిచేసే కేసీఆర్‌ ప్రభుత్వానికి అండగా నిలవాలని జీవన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌లో చేరిన పోశెట్టి మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ ఆదర్శ పాలన నచ్చి గులాబీ కండువా కప్పుకున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్‌, ఎస్‌ఆర్‌ రమేష్‌, సుంకరి రవి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »