ఆర్మూర్‌లో క్రిస్టియన్‌ ఫంక్షన్‌ హాలుకు రూ.50 లక్షలు

ఆర్మూర్‌, డిసెంబరు 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్‌ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ విందులో జీవన్‌ రెడ్డి స్వయంగా వడ్డించారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శనీయమన్నారు. ప్రేమ, జాలి, దయ, కరుణ ప్రతి ఒక్కరిపై చూపించాలన్నది యేసుక్రీస్తు బోధనల సారాంశమన్నారు.

అసూయ, ఈర్ష, ద్వేషాలకు దూరంగా ఉండాలని ఏసుక్రీస్తు బోధించారని ఆయన గుర్తుచేశారు. యేసు క్రీస్తు బోధనలు విశ్వశాంతికి దోహదం చేస్తున్నాయని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరూ నడిచి విశ్వ శాంతికి పాటుపడాలని ఆయన ఉద్బోధించారు. దేశంలోనే సర్వ మతాలకు సమాన గౌరవం ఇస్తూ అన్ని మతాల వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రైస్త సోదరుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదన్నారు. మైనారిటీల సంక్షేమానికి, విద్య, ఉపాధి కోసం కావాల్సినంత డబ్బులు ఖర్చు పెడుతున్నదన్నారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపులు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తున్నాయన్నారు. 2014-15 బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.1,030 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2015-16 బడ్జెట్‌లో రూ. 1,130 కోట్లు, 2016-17 సంవత్సరంలో రూ.1,204 కోట్లు, 2017-18 లో 1249.66 కోట్లు, 2018-19 లో రూ.2 వేల కోట్లు, 2019-20 బడ్జెట్‌లో రూ.2,004 కోట్లు, 2020-21లో రూ.1518.06 కోట్లు, 2021-22లో రూ.1,606.39 కోట్లు, 2022-23లో రూ. 1,728 కోట్లు కేటాయించినట్టు జీవన్‌ రెడ్డి వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం రంజాన్‌, క్రిస్మస్‌ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన పేర్కొంటూ మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ స్వయంగా క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటున్నారన్నారు. రంజాన్‌, క్రిస్మస్‌ సందర్భంగా ప్రతీ సంవత్సరం రాష్ట్రంలోని నిరుపేద మైనారిటీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తుల పంపిణీ చేపడుతున్నదన్నారు. ఇందులో భాగంగా రెండు లక్షల మంది క్రిస్టియన్లకు, నాలుగు లక్షల మంది ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్‌ విందులను, క్రిస్మస్‌ విందులను ఏర్పాటు చేసి లౌకిక స్ఫూర్తిని చాటుకుంటున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలుండేవని,తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలును కల్పించిందన్నారు.

మత సామరస్యానికి భంగం కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రశాంత వాతావరణంలో మనం ఉన్నామన్నారు. ఆర్మూర్‌ లో క్రిస్టియన్‌ ఫంక్షన్‌ హాలు నిర్మాణానికి పది కోట్ల రూపాయల విలువ గల భూమిని కేటాయించి రూ.50లక్షలు మంజూరు చేశాం. వచ్చే ఏడాది క్రిస్మస్‌ పండుగ నాటికి ఫంక్షన్‌ హాలు నిర్మాణం పూర్తయ్యేలా రేపే పనులు ప్రారంభించాలన్నారు.

మామిడిపల్లిలో నిర్మించిన ఆర్మూర్‌ నియోజకవర్గ ఫాస్టర్స్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌ కు అదనంగా మరో రూ. 10లక్షలు మంజూరు చేశాం. మీ అందరికీ ముందుగానే నా హృదయ పూర్వక క్రిస్మస్‌ శుభాకాంక్షలు అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో వేణు గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ మున్ను, పట్టణాధ్యక్షులు పూజ నరేందర్‌, సీనియర్‌ నాయకులు రవి గౌడ్‌, పండిత్‌ ప్రేమ్‌, నియోజకవర్గ పాస్టర్లు, బిషప్‌లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »