కామారెడ్డి, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీజనల్ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం చర్యలు పక్కాగా నిర్వహించాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు సంరక్షణ చేపట్టాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ లకు సూచించారు.
బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సెక్రెటరీ రిజ్వీ , రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు జిల్లా జిల్లా పంచాయతీ అధికారులు జిల్లా అటవీ అధికారులతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో, మున్సిపాలిటీలలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణకు గ్రామం, మండలం, వారీగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
అటవీ శాఖ సమన్వయంతో పెద్ద మొక్కలు నాటాలని, పచ్చదనం పెంపొందించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని, ఏరోజు చెత్త ఆరోజే తొలగించాలని, ఇంటింటి నుండి సేకరించాలని, తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా నిర్వహించాలని, చెత్తను కంపోస్ట్ షెడ్లకు తరలించాలని తెలిపారు.
వైకుంఠధామాలలో అన్ని వసతులు కల్పించాలని, కాంపౌండ్ వాల్స్ తప్పక నిర్మించాలని, పూల మొక్కలతో పచ్చదనం పెంపొందించాలని, వైకుంఠధామాలను వాడుకలోకి తేవాలని తెలిపారు. గ్రామ సభలు నిర్దేశించిన సమయంలో కచ్చితంగా నిర్వహించాలని, అన్ని స్థాయిల మండల అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని, గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, గత గ్రామ సభలకు ప్రస్తుత గ్రామ సభలకు సమస్యల పరిష్కార పురోగతిని పరిశీలించాలని తెలిపారు.
జిల్లా పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలని, చెత్త చెదారము రోడ్లపై కనిపించకుండా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలించాలని, సీజనల్ వ్యాధులు తలెత్తకుండా ప్రతిరోజు పారిశుద్యం పరిశీలించాలని తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిర్వహణ పట్ల రాష్ట్ర స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హరితహారంలో నాటిన చెట్లను కాపాడుకోవాలని, గత సంవత్సరం నాటిన మొక్కల పరిస్థితి ఈ సంవత్సరం పరిశీలించుకోవాలని, పచ్చదనం పెంపొందేలా అధికారులు తమ కార్యాచరణను పాటించాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాలలో, పట్టణాలలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, గ్రీనరీ వంటి ముఖ్య కార్యక్రమాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నూతన వాహనాలను అందించడం జరిగిందని, అలాగే ఎమర్జెన్సీ నిధుల కింద వారికి 25 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈనెల 20, 21 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నందున పూర్తిస్థాయి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పట్ల జిల్లా కలెక్టర్లు , అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు పెట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి మండలంలో పల్లె ప్రకృతి వనం కోసం 10 ఎకరాల స్థల సేకరణకు, అలాగే పట్టణాలలో అర్బన్ పార్కులకు స్థలాలకు భూసేకరణ వెంటనే చేపట్టాలని సూచించారు. నర్సరీల ద్వారా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించే విధంగా కార్యాచరణ చేయాలని తెలిపారు.
మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ కింద జిల్లాలోని అన్ని రోడ్లలో ఎక్కువ వరుసలలో మొక్కలు నాటాలని, జిల్లా కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రోడ్లలో మొక్కల పెంపకంతో కవర్ చేయాలని, అటవీ రీజనరేషన్ విధానం ద్వారా ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటాలని తెలిపారు.
గ్రామ, పంచాయతీ మున్సిపాలిటీలలో ప్రతి వార్డులో గ్రీనరీ పెంచాలని, అవెన్యూ ప్లాంటేషన్ క్రింద కళాశాలలు, పాఠశాలలు చెరువులు,ఖాళీ స్థలాలు గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీల కేటాయించిన బడ్జెట్లో పది శాతం బడ్జెట్ ను తప్పనిసరిగా గ్రీన్ బడ్జెట్ కింద వినియోగించేలా పరిశీలించాలని తెలిపారు.
వర్షాలు కురుస్తున్నందున మురికి కాలువలలో పూడికతీత పనులు పక్కాగా నిర్వహించాలని, ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయాలని, క్రమం తప్పకుండా ప్రతిరోజు నిర్వహించాలని తెలిపారు. వైకుంఠ గ్రామాలు లేనిచోట మూడు ఎకరాలకు తక్కువ కాకుండా స్థల సేకరణ చేయాలని సూచించారు.
మిషన్ భగీరథ మంచినీరు ప్రతిరోజు వచ్చేలా పర్యవేక్షించాలని, పైపులైన్ల పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు. గ్రామ, మున్సిపాలిటీలలో సీసీ చార్జెస్ నిర్వహణ పర్యవేక్షించాలని తెలిపారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు , పల్లె ప్రకృతి వనాలు లేని చోట వెంటనే స్థల సేకరణ చేసి కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో 50 వేల నర్సరీల ద్వారా 30 కోట్లకు పైగా మొక్కలు వ్యాప్తంగా నాటుతున్న ట్లు తెలిపారు. గత సంవత్సరం నాటిన మొక్కలను పరిశీలించాలని, ట్రీ గార్డులు దెబ్బతిన్న చోట మార్చాలని, పాదులు ఏర్పాటు పరిశీలించాలని, జియో ట్యాగింగ్, ఆన్లైన్ నమోదు పనులను ఎప్పటికప్పుడు వహించాలని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుల ఏర్పాటు కోసం స్థల సేకరణ వెంటనే పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు వేదిక భవనాలో రైతులకు శిక్షణా కార్యక్రమాల ఏర్పాటుతో సలహాలు సూచనలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ ఆరోగ్య కేంద్రాలలో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ధరణిలో పెండింగ్ లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అలాగే భూ సమస్యల దరఖాస్తులను క్లియర్ చేయాలని తెలిపారు.
వ్యాక్సినేషన్ సంబంధించి హైరిస్క్ వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే , జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావు, జిల్లా అటవీ అధికారి నిఖిత, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా ట్రాన్స్‌కో అధికారి శేషారావు, ఎపిడి సాయన్న, అధికారులు పాల్గొన్నారు.