నిజామాబాద్, డిసెంబరు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు.
శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరిత హారం, పల్లె ప్రకృతి, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డిసెంబర్ చివరి నాటికి మొదటి విడతలో అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన 114 పాఠశాలల్లో మన ఊరు – మన బడి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని స్పష్టమైన గడువు విధించారు. అదేవిధంగా 30 లక్షలకు పైబడి విలువ కలిగిన పనులకు సంబంధించి వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరీ తెలిపిన 325 పాఠశాలల్లోనూ పనులన్నీ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఈ.ఈ లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు.
ఒకవేళ ఎక్కడైనా ఎస్టిమేషన్లో లేని పనులు చేపడితే, వాటికి కొత్తగా ఎస్టిమేషన్లు రూపొందించి ఎం.బీ రికార్డులు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటదివెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా సానుకూల దృక్పధంతో ముందుకెళ్లాలని కలెక్టర్ ఏ.ఈలకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, మరింత ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో సగటున 62 శాతం లింకేజీ రుణాల పంపిణీ జరుగగా, కొన్ని క్లస్టర్లు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని అన్నారు. ఈ నెల 31 నాటికి అన్ని క్లస్టర్ల పరిధిలో 75 శాతం లక్ష్యాన్ని సాధించాలని స్పష్టమైన గడువు విధించారు. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో వెనుకబడిన ఏపీఎం లు, సి.సి లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. రుణాల పంపిణీలో క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే, సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.
జిల్లాలోని మొత్తం 530 గ్రామ పంచాయతీల పరిధిలోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలను తక్షణమే ఎంపిక చేసి, యుద్ధ ప్రాతిపదికన క్రీడా ప్రాంగణాలను నెలకొల్పేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బృహత్ ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణను మెరుగుపర్చుకోవాలని, నెలాఖరు కల్లా అన్ని నర్సరీల్లో మొక్కల పెంపకానికి వీలుగా బ్యాగ్స్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో ఏ.పీ.ఓ లను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ప్రతి జీ.పీ, ప్రతి ఆవాస ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులా పిచ్చి గడ్డి, చెత్తాచెదారంను తొలగింపజేయాలని, డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని అన్నారు. డీఎల్‌పీఓలు అనునిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సులో జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, మెప్మా పీ.డీ రాములు, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు దేవిదాస్, భావన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.