ఆర్మూర్, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తర తెలంగాణలో గల్ఫ్ ఉద్యోగాల పేరిటి నకిలీ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు ఇష్టారాజ్యం నడుపుతున్నారని, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో నిత్యం అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారని, గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల పేరిటి లక్షల రూపాయలు గుంజుకొని విసిట్ వీసా పై పంపిస్తున్నారని, వారిని అదుపులో పెట్టే వారె లేరా అని ప్రవాస భారతీయుల హక్కుల వేదిక కన్వీనర్ కోటపాటి నర్సింహనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అమాయకులైన యువకుల దగ్గర లక్ష రూపాయలకు పైగా తీసుకొని అక్కడి దేశాల్లో 40/50 వేల జీతం అని నమ్మబలికి, అక్కడికి తీసుకొని వెళ్ళాక పర్మినెంట్ ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేస్తున్నారన్నారు. ఏదో ఒక ఉద్యోగం చూపించినా అక్కడి కఠినమైన వాతావరణంలో పనిచేయ్యలేక ఇంటికి వస్తామంటే రాలేక, అక్కడి చట్టాల ప్రకారం లక్షల రూపాయలు పెనాల్టీ కట్టలేక సతమతం అవుతున్నారన్నారు.
ఇక్కడి ఏజెంట్ పై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం వలన మోసాలు కొనసాగుతూనే ఉన్నాయని, చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ శాఖ నిస్తేజంగా ఉందన్నారు. ఇటీవల 5 నెలల క్రితం దేవర్ల శేఖర్, కొత్తపల్లి , నందిపేట్ మండలం, బట్టు భోజేందర్, ఉమ్మెడ, మచ్చర్ల రవీందర్, తూంపల్లి, సిరికొండ గ్రామాలకు చెందిన యువకుల నుండి చిక్కెల స్వామి, నిజామాబాద్ (మం) తాళ్ల కొత్తపేట గ్రామానికి చెందిన సబ్ ఏజెంట్ ఒక్కొక్కరి నుండి 82 వేలు తీసుకొని ఓమన్ దేశంలో క్లీనింగ్ సెక్షన్లో పని ఉందని నెలకు 25 వేల జీతామని చెప్పి మస్కట్ తీసుకెళ్లి ఒక రూమ్‌లో నాలుగు నెలల పైగా ఉంచి ఎటువంటి పని చూపించలేదన్నారు.
యువకులు ఇంటికి వద్దామంటే ఒక్కొక్కరు 1 లక్ష 20 వేలు పెనాల్టీ కట్టమని అక్కడి అధికారులు చెప్తున్నారని, ఇప్పటికే అక్కడి ఇండియన్ ఎంబాసిలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎటువంటి జవాబు రావడం లేదన్నారు. ఇంటిదగ్గర తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని, యువకుల తల్లిదండ్రులు శుక్రవారం ఆర్మూర్‌కు వచ్చి తమ పిల్లలను ఏ విధంగానైనా ఇండియాకు రప్పించాల్సిందిగా కోటపాటి నరసింహ నాయుడుని వేడుకున్నారు.
కోటపాటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నకిలీ ఏజెంట్ల దోపిడీని అరికట్టాలంటే వెంటనే ఇప్పటికే వందలాది మంది యువకులను మోసగించిన చిక్కెల స్వామిని అరెస్టు చేసి అతని చేత మస్కట్లో చిక్కుకున్న వారికి పెనాల్టీ కట్టించి ఇండియాకు రప్పించే బాధ్యత అతనిపై పెట్టాలన్నారు. ముందుగా తీసుకున్న రూ. 82 వేలు వాపస్ ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈరోజు అటు ఇండియన్ ఎంబాసికి ఇటు పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశామన్నారు. ఏజెంట్ల మోసానికి విరుగుడుగా ప్రతి జిల్లాలో ఒక్కరో ఇద్దరో నకిలీ ఏజెంట్లను ఎన్‌కౌంటర్ చేయాల్సిందిగా కోటపాటి డిమాండ్ చేశారు.