ఆర్మూర్, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన బైరి నరేష్‌పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి పి. డి.యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆలూరు మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి అధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి నరేష్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా బి. ఆర్.ఎస్. ఉమ్మడి ఆర్మూర్ మండల అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ ధర్మం గురించి అడ్డగోలుగా మాట్లాడటం, రాజకీయాలకు హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఫ్యాషన్‌గా మారిందని, ప్రపంచానికి సంస్కారం నేర్పిన హిందూ మతం జోలికి ఎవడు వచ్చిన వెయ్యి అడుగుల గోతి తీసి పాతి పెడతామని హెచ్చరించారు.
నాస్తికుల సంఘం పేరు మీద మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పోటో పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఒకరి మతం గురించి సంస్కారహీనంగా మాట్లాడే హక్కు బైరీ నరేష్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన భైరి నరేష్, అతనితో వేదిక పంచుకుని సహకరించిన వ్యక్తులపై పి.డి.యాక్ట్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఆలూరు అయ్యప్ప సేవా సమితి సభ్యులు, ఆర్మూర్ మండల బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, ఆలూరు గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్, ఉప సర్పంచ్ దుమ్మజీ శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేష్, సొసైటీ మాజీ చైర్మెన్ నలిమెల మోహన్, డైరెక్టర్‌లు కళ్లెం సాయిరెడ్డి, బార్ల సంతోష్, బొప్పరం రమేష్, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు, గ్రామ యువకులు పాల్గొన్నారు.