నిజామాబాద్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా తుది ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేష్ దత్ ఎక్కా సూచించారు. మంగళవారం ఆయన కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయా శాసన సభ నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు.
జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన తీరుతెన్నుల గురించి కలెక్టర్ సి.నారాయణరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా మాట్లాడుతూ, ఈ నెల 5 వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించాల్సి ఉందని, ఎలాంటి లోటుపాట్లు, తప్పులు లేకుండా తుది జాబితాను క్షుణ్ణంగా పరిశీలన చేసుకుకోవాలని సూచించారు.
ఈ విషయంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తూ, పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన జరిగేలా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్‌ల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియను ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులు సైతం ర్యాండమ్‌గా చెక్ చేసుకోవాలన్నారు.
ఓటర్ల తుది జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించడంతో పాటు పోలింగ్ స్టేషన్ వారీగా, ఈఆర్‌ఓ, డీఆర్‌ఓ స్థాయిలలో ప్రదర్శించాలని, సంబంధిత వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారి నుండి వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని, నిర్ణీత వయస్సు నిండిన మీదట వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చాలని సూచించారు.
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఓటరు జాబితాలో డూప్లికేషన్ లకు తావు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 83 శాతం ఆధార్ సీడిరగ్ జరిగిందని, 90 శాతం పైచిలుకు అనుసంధానం జరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు, సూచనలకు అనుగుణంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్నిపూర్తి స్థాయిలో పక్కాగా నిర్వహించామని, ఈ నెల 5 న తుది జాబితాను ప్రదర్శించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 25 న 73 వేల మందికి ఓటరు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన ఓటర్లకు సంబంధించి కొత్త ప్రదేశంలోని ఏదైనా పోలింగ్ బూత్ లో వారు తమ పేరును నమోదు చేసుకున్నారా, లేదా అన్నది స్పష్టంగా నిర్ధారణ చేసుకున్న తరువాతే జాబితా నుండి పేరును తొలగించామని అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తప్పిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాకు చెందిన సుమారు 65 వేల పైచిలుకు మంది వివిధ పనుల నిమిత్తం విదేశాలకు వలస వెళ్లిన దృష్ట్యా, జనాభా నిష్పత్తితో పోలిస్తే ఓటరు జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య ఒకింత ఎక్కువగా ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా వెల్లడైందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, అధికారులు సంతోష్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.