నిజామాబాద్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ పిఆర్సి సిఫార్సు మేరకు కనీస వేతనం 19 వేల రూపాయలు ఇవ్వాలని, దానిపై వేతనపెంపు అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులు 2014 ఫిబ్రవరి 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు సమ్మె చేశారని, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కార్మిక సంఘాలతో చర్చలు జరిపారని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు పీ.ఆర్.సీ ఫైనల్ చేసిన చివరి కనీస వేతనం అందిస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
గతంలో 8వ, 9వ పి.ఆర్.సిలో చివరి బేసిక్ వేతనం ప్రకారం కార్మికులకు వేతనాలు ఇచ్చారన్నారు. కావున 11వ పిఆర్సి చివరి బేసిక్ వేతనం 19 వేల రూపాయలు, దానిపై 30 శాతం వేతన పెంపు అమలు చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం సత్వరమే కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.రాజేశ్వర్, నాయకులు శివకుమార్, గోవర్ధన్, శాంతికుమార్, తిరుపతి, రాము, లక్ష్మణ్, విటల్, అశుర్, గంట లక్ష్మి, లలిత, సుజాత, వెంకట్, నరసయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.