భీంగల్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ప్రవేశ పెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీంగల్ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు 1కోటి 20 లక్షల పైగా విలువ చేసే కళ్యాణ లక్ష్మి, శాది ముబారక్ చెక్కులను మంత్రి బుధవారం పంపిణీ చేశారు.
దేశంలో ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి,కేసిఆర్ కిట్ లాంటి సంక్షేమ పథకాలు లేవని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇట్లాంటి పథకం తేవాలనే ఆలోచన చేయలేదన్నారు. మొదట 50 వేలతో ప్రారంభం అయిన ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని 1లక్ష రూపాయలకు కేసిఆర్ పెంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 లక్షల 56 వేల మంది లబ్ధిదారులకు 10 వేల 323 కోట్లు ఆర్ధిక సహాయం అందించారని అన్నారు.
12 లక్షల 60వేల మంది బాలింతలకు 263 కోట్ల విలువ చేసే కేసిఆర్ కిట్లు అందించారన్నారు. గర్భంతో ఉన్నప్పుడు ఆర్ధిక ఇబ్బందులు పడకూడదని..ఆడబిడ్డ పుడితే 13వేలు,అబ్బాయి పుడితే 12 వేలు మానవీయ కోణంలో అందిస్తున్నది కేసిఆర్ ప్రభుత్వం అని మంత్రి వెల్లడిరచారు. ఇటీవల కొంత మంది అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఊర్లలో తిరుగుతున్నారని వారిని మీ పాలిత రాష్ట్రాల్లో కేసిఆర్ ఇక్కడ ఇస్తున్న పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాలని అన్నారు.
అక్కడ చేయనోడు ఇక్కడ చేస్తామంటే ఎట్లా నమ్ముతాం అన్నారు. అన్ని విధాల సాయం అవుతూ తోడుగా ఉంటున్న కేసిఆర్‌కు మద్దతుగా నిలవాలని మంత్రి ఈ సందర్బంగా కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.