కామారెడ్డి, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి యువజనోత్సవాలలో జిల్లాలోని యువతి, యువకులు రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలోని చింతల బాలరాజు గౌడ్ స్మారక సమావేశ మందిరంలో గురువారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనో త్సవాలు 2023 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
స్వామి వివేకానందను యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో యువతీ, యువకులు రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కళా ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ మాట్లాడారు. యువతీ, యువకులు తమకు నచ్చిన రంగాలను ఎంచుకొని ఇష్టపడి సాధన చేసి జీవితంలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, అధ్యాపకులు, యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారులు పాల్గొన్నారు.