కామారెడ్డి, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 31 లోగా 90 శాతం బ్యాంకు లింకేజీ రుణాలను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసుళ్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఇప్పటివరకు రామారెడ్డి, రాజంపేట, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో బ్యాంకు లింకేజీ రుణాలు 80 శాతం వసూలు చేశారని తెలిపారు. స్త్రీ నిధి రుణాలు 100 శాతం వసూలు చేపట్టాలని చెప్పారు. జనవరి 18 నుంచి జరిగే కంటి వెలుగు కార్యక్రమానికి స్వయం సహాయక సంఘాల మహిళలు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డిఆర్డిఓ సాయన్న, ఏపీడి మురళి కృష్ణ, డిపిఎంలు సుధాకర్, రమేష్, అధికారులు పాల్గొన్నారు.