ఆయిల్‌ పాం సాగు నిర్దేశిత లక్ష్యానికి చేరాలి

నిజామాబాద్‌, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక లాభాలను అందించే ఆయిల్‌ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. తద్వారా ప్రతీ మండలంలోనూ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు.

గురువారం సాయంత్రం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వ్యవసాయ, ఉద్యానవన, తదితర శాఖల అధికారులతో ఆయిల్‌ పాం పంట సాగుపై సమీక్ష జరిపారు. జిల్లాలో 6 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పాం సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని, వచ్చే వారం నాటికి పూర్తిస్థాయి విస్తీర్ణంలో ఈ పంట సాగుకు రైతులు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆదర్శ రైతులు, మండల స్థాయి అధికారులను సమీకరించి ఆయిల్‌ పాం సాగవుతున్న క్షేత్రాల సందర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.

ఆయిల్‌ పాం సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆయిల్‌ పాం సాగు వల్ల సమకూరే లాభాల గురించి రైతుల్లో నమ్మకాన్ని కలిగిస్తే తప్పనిసరిగా వారు ముందుకు వస్తారని కలెక్టర్‌ అన్నారు. ఆయిల్‌ పాం పంటకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఇన్‌ పుట్‌ సబ్సిడీని అందిస్తూ, అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోందని, ఈ విషయాలను రైతులకు అర్ధమయ్యే రీతిలో వివరించాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత సీజన్‌ కు సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు గట్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »