నిర్లక్ష్యానికి తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు

నిజామాబాద్‌, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటదివెంట జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత ఏ.ఈ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, హరిత హారం, పల్లె ప్రకృతి, మినీ బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు.

ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో తక్షణమే పనులను పూర్తి చేయించి ప్రారంభోత్సవాలకు సన్నద్ధమై ఉండాలన్నారు. పలు పాఠశాలల్లో నిర్దేశిత పనులు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడం పట్ల కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. నిధులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పనులు చేసిన ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో ఎందుకు ఆలస్యం అవుతోందని సంబంధిత ఏ.ఈ లపై ఒకింత ఆగ్రహం ప్రదర్శించారు.

వెంటవెంటనే ఎఫ్‌.టీ.ఓ లు జెనరేట్‌ చేసి బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాల్సిందిగా పదేపదే చెబుతున్నప్పటికీ అలసత్వం ప్రదర్శిస్తున్నారని పలువురిని మందలించారు. వచ్చే బుధవారం నాటికి పరిస్థితిలో మార్పు రావాలని, పద్దతి మార్చుకొని వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తామని హెచ్చరించారు. ఆయా పాఠశాలలకు సంబంధించిన ఖాతాలలో మిగులు నిధులను వెచ్చిస్తూ ప్రాధాన్యతాక్రమంలో స్టీల్‌ మెటల్‌తో కూడిన నేమ్‌ బోర్డు, వినియోగానికి అనువుగా ఉన్న పాత అలమారాలు, ఇతర ఫర్నిచర్‌ కు మరమ్మతులు, పెయింటింగ్‌ వేయించాలని, మెట్లు, ర్యాంప్‌ ఉన్న చోట రెయిలింగ్‌ ఏర్పాటు చేయించాలని సూచించారు.

పాఠశాల ఆవరణను చక్కగా చదును చేయించి, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటించాలని, ఆకట్టుకునే రీతిలో లాన్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, గడువులోపు పూర్తి చేయించాలని ఆదేశించారు. కాగా, అన్ని గ్రామ పంచాయతీలు, ఆవాస ప్రాంతాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కావాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తిస్తూ, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు అవసరమైన సామాగ్రిని వచ్చే సోమవారం నాటికి సమకూర్చుకోవాలని ఆదేశించారు. సంక్రాతి పండుగ నాటికి క్రీడా ప్రాంగణాలు అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చేలా గట్టిగా కృషి చేయాలని అన్నారు. మినీ బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని పలు మండలాల ఏ.పీ.ఓ లను కలెక్టర్‌ హెచ్చరించారు.

వీటి నిర్వహణ కోసం వన సేవకుడిని నియమించుకుని, నీటిని అందించేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ సేవలను వినియోగించుకునే వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బృహత్‌, మినీ బృహత్‌ పల్లె ప్రకృతి వనాల నిర్వహణను క్రమం తప్పకుండ పర్యవేక్షణ చేయాలని డీఆర్డీఓ చందర్‌ ను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్‌ సూచించారు.

హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జెడ్పి సీఈఓ గోవింద్‌, డీపీఓ జయసుధ, మెప్మా పీ.డీ రాములు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు దేవిదాస్‌, భావన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »