నిజామాబాద్, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారంలో భాగంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించే విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
మాక్లూర్ మండలం మామిడిపల్లి నుండి ఆర్మూర్, అర్గుల్ మీదుగా డిచ్ పల్లి వరకు కలెక్టర్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామా శివారులో రోడ్డుకు ఆనుకుని ఉన్న పంట పొలంలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ కూలీలను గమనించిన కలెక్టర్, వారి వద్దకు వెళ్లి కూలీలను పలకరిస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రోజువారీ కూలీ ఎంత గిట్టుబాటు అవుతోంది, ఎన్ని గంటలు పని చేస్తారు, ఒక ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేసేందుకు ఎంత మంది కూలీలు అవసరం అవుతారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలను కలెక్టర్ తన చేరువకు ఆహ్వానించి వారితో ఫోటోలు దిగారు.
కాగా, అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన సందర్భంగా అక్కడక్కడా లోపాలను గమనించిన కలెక్టర్, తక్షణమే వాటిని సవరించాలని అధికారులకు సూచించారు. రహదారి పొడుగునా ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనిపించకుండా విరివిగా మొక్కలు నాటాలని, రోడ్డుకు రెండు వైపులా పచ్చదనంతో కూడిన వాతావరణం కనిపించాలన్నారు. ట్రీగార్డులు, కర్రలను సరి చేసుకుంటూ, దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్తగా ఎతైనా మొక్కలు వెంటనే నాటించాలని ఆదేశించారు.
మొక్కల చుట్టూ పెరిగిన గడ్డిని తొలగించాలని, రోడ్డు పక్కన చెత్తా చెదారం ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణను నిశితంగా పర్యవేక్షణ జరపాలని, క్రమం తప్పకుండా మొక్కలకు నీటిని అందించేలా చూడాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఉపాధి హామీ కూలీలను సమకూర్చడంతో పాటు ఇతరత్రా సహకారాన్ని అందిస్తామని, అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు ఉండకూడదని కలెక్టర్ సూచించారు.
అర్బన్ పార్కు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
నిజామాబాద్ నగర శివారులోని చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి నుండి అర్బన్ పార్క్ మెయిన్ గేట్ వరకు ఇరువైపులా అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేసి పర్యాటకులను చూడగానే ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
పనులు నాణ్యతతో జరుగుతున్నప్పటికీ, ఒకింత జాప్యం చోటుచేసుకుంటోందని అన్నారు. తుదిదశలో మిగిలిఉన్న పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతూ సత్వరమే పూర్తి చేయించాలన్నారు. మెయిన్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వారికి కూడా అర్బన్ పార్కు ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దాలని, ఆకట్టుకునే పెయింటింగ్స్ వేయించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేసి అర్బన్ పార్క్ ను ప్రారంభోత్సవానికి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున పనుల్లో ఎంతమాత్రం జాప్యానికి తావుండకూడదని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఎఫ్ డీ ఓ భవాని శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, హిమచందన, మాక్లూర్, డిచ్ పల్లి ఎంపీడీవోలు క్రాంతి, గోపి దితరులు ఉన్నారు.