కామారెడ్డి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలోని చింతల బాల్ రాజు గౌడ్ స్మారక సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి సిలబస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రత్యేక తరగతుల ద్వారా బోధన చేపట్టి సత్ఫలితాలు వచ్చే విధంగా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లాలో పదో తరగతి సిలబస్ 85 శాతం పూర్తయినట్లు చెప్పారు. జనవరి 31 లోపు 100 శాతం సిలబస్ పూర్తి చేయాలని పేర్కొన్నారు.
జిల్లా విద్యాధికారి రాజు మాట్లాడారు. ప్రణాళిక బద్ధంగా పాఠ్యాంశాల బోధన చేపట్టాలన్నారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా పరీక్షల విభాగం ఇంచార్జ్ నీలి లింగం, సమన్వయకర్తలు శ్రీపతి, బలరాం, శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.