నిజామాబాద్, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, జెడ్పి సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడంతో పాటు అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి
కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, మన ఊరు – మన బడి, హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా మండల ప్రత్యేక అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. మన ఊరు – మన బడి పనుల ప్రగతిని సమీక్షించాలని, పూర్తయిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎఫ్.టీ.ఓలు జెనరేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే పంచాయతీ కార్యదర్శులను ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ఎక్కడైనా మొక్కలు పాడైపోతే, వాటి స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయించి, అవి ఏపుగా పెరిగేలా నిర్వహణను మెరుగుపర్చాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటించి పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రతి గ్రామ పంచాయతీ, ఆవాస ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కావాలన్నారు.
కాగా, వార్షిక పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా, పదవ తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులకు సంక్రాతి పండుగ తరువాత ప్రత్యేక పునఃశ్చరణ తరగతుల నిర్వహణ, ప్రేరణ కార్యక్రమాల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని డీఐఈఓ రఘురాజ్, డీఈఓ దుర్గాప్రసాద్ లను ఆదేశించారు. శాఖాపరమైన పనులు పెండిరగ్ ఉండకుండా, వెంటదివెంట పూర్తి చేయాలని అధికారులకు హితవు పలికారు.