నిజామాబాద్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల కళాశాలలు ఉమ్మడిగా నిర్వహించే ప్రవేశ పరీక్ష టీజీయూజీ సెట్ – 2023 ను పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టీజీయూజీ సెట్ – 2023 ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకునే ఆసక్తి, అర్హత కలిగిన వారు ఫిబ్రవరి 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వెబ్ సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసుకున్న వారితో పాటు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని అన్నారు. గురుకుల డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు వివిధ రకాల జిఆర్‌ఈ, డేటా సైన్స్, ఐఐటి జామ్ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అందుకునేలా ప్రోత్సహిస్తున్నాయని అన్నారు.
ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం స్థానిక డిగ్రీ కళాశాలల బాధ్యులను సంప్రదించాలని సూచించారు. నిజామాబాద్ సోషల్ వెల్ఫేర్: 7995010688, ఆర్మూర్ సోషల్ వెల్ఫేర్:9182584753, తెలంగాణ గిరిజన గురుకుల కళాశాల నిజామాబాదు:9030729706 నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.
పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల-నిజామాబాద్ ప్రిన్సిపల్ కే లావణ్య, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల-ఆర్మూర్ ప్రిన్సిపల్ కే గాయత్రి, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల-నిజామాబాద్ ప్రిన్సిపల్ జైనథ్, ప్రిన్సిపల్ వాసవీలత తెలుగు విభాగం అధిపతి కే రజిత పాల్గొన్నారు.