నిజామాబాద్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఈ నెల19నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం పలు శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాక్లూర్ మండలం కల్లెడి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో, బొంకన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నెలకొల్పిన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికే శిబిరాలకు చేరుకున్న సామాగ్రి గురించి ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ శిబిరాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. శిబిరాలలో ఒక్కో టేబుల్ వారీగా నిర్వహించాల్సిన విధుల గురించి సిబ్బందిని ప్రశ్నిస్తూ, వారి సన్నద్ధత గురించి తెలుసుకున్నారు. వైద్య బృందంలోని సభ్యులు సమయ పాలన పాటిస్తూ, ఉదయం 8.30 గంటల్లోపు శిబిరాల వద్దకు చేరుకోవాలన్నారు.
ప్రతి రోజు నిర్దేశిత సంఖ్యలో ప్రజలు శిబిరాలను సందర్శించి కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు. శిబిరాలు పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేలా, కంటి వెలుగు లక్ష్యం నెరవేరేలా ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.