నిజామాబాద్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మండల కేంద్రమైన నవీపేట్ తో పాటు అదే మండలంలోని అభంగపట్నంలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. రోజుకు సగటున ఎంత మంది నేత్ర పరీక్షల కోసం వస్తున్నారు, ఎక్కువగా ఏ వయస్సు వారు ఉంటున్నారని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. క్యాటరాక్ట్ సర్జరీ అవసరం ఉన్న వారి వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో పొందుపర్చాలని, వారిని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కంటి జబ్బులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతోందన్నారు. అవసరమైన వారికి శిబిరాల్లోనే ఉచితంగా మందులు, రీడిరగ్ అద్దాలు అందిస్తున్నారని అన్నారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరం ఉన్న వారికి 15 నుండి 20 రోజుల్లోపు వాటిని వారి ఇళ్లకు చేర్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 70 బృందాలు కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నాయని, వీటిలో రూరల్ ఏరియాల్లో 48 బృందాలు, పట్టణ ప్రాంతాల్లో 22 బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పించి శిబిరాలకు తరలి వచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కలెక్టర్ కోరారు. శిబిరాల విజయవంతానికి పంచాయతీ రాజ్, మున్సిపల్, ఐకేపీ, మెప్మా, ఐసీడీఎస్ తదితర శాఖలు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
మన ఊరు – మన బడి పనులు తనిఖీ
నవీపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు -మన బడి కింద చేపట్టిన పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఇంకనూ తుది దిశగా మిగిలి ఉన్న పనులను కూడా నాణ్యతతో చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల ఆవరణను చక్కగా చదును చేసి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.
విద్యార్థుల కోసం వండిన మధ్యాన్న భోజనం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ సాజిద్ అలీ, తహసీల్దార్ వీర్ సింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.