హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

నిజామాబాద్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ లతో పాటు జానకంపేట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మల్కాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేశారు.

శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ హరితహారం, మన ఊరు – మన బడి, కంటి వెలుగు కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జానకంపేట్‌ నుండి అబ్బాపూర్‌ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల నిర్వహణను మెరుగుపర్చుకోవాలని పదేపదే సూచించినా, తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు సంబంధిత ఏపీఓలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ కరాఖండీగా తేల్చి చెప్పారు. ఇప్పటివరకు సానుకూల ధోరణిలో చెబుతూ వచ్చానని, ఇకపై అలసత్వానికి తావు కల్పించే వారిపై తక్షణమే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీచోటా ఎవెన్యూ ప్లాంటేషన్లతో పాటు, ఇన్స్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ నిర్వహణ సక్రమంగా కొనసాగాల్సిందేనని, ఎక్కడైనా తేడా వస్తే సంబంధిత అధికారులు, సిబ్బంది మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. మన ఊరు – మన బడి ప్రగతిపై సమీక్షిస్తూ, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించి వెంటనే ఎఫ్‌.టీ.ఓ లు జెనరేట్‌ చేయాలని ఏ.ఈలను ఆదేశించారు.

ఈ ప్రక్రియ పూర్తి చేయని కారణంగా నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు చేసిన వారికి సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగడం లేదన్నారు. దీని వల్ల ప్రభుత్వ పనితీరుపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉన్నందున, ఏ.ఈలు వెంటదివెంట ఎఫ్‌.టీ.ఓ లు జెనరేట్‌ చేసేందుకు చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే, ఏ.ఈలను సైతం సస్పెండ్‌ చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ నెల 25 వ తేదీ నాటికి పూర్తయిన పనులన్నింటికీ ఎఫ్‌.టీ.ఓ లు సిద్ధం కావాలని గడువు విధించారు. అలాగే, ఉపాధి హామీ కింద మంజూరీ తెలిపిన పనులను మార్చి నెలాఖరు నాటికి అన్ని పాఠశాలల్లో పూర్తి చేయాలన్నారు.

ప్రతి మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసిన బడులలో మిగిలిఉన్న తుది దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంపీడీఓలు గట్టి పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇదిలాఉండగా, కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని, ఈ మేరకు అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో కృషి చేస్తున్నారని కలెక్టర్‌ అభినందించారు. ఇకముందు కూడా ఇదే స్పూర్తితో పని చేయాలని, శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన రీతిలో నేత్ర పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు, కంటి అద్దాలను అందించాలని కలెక్టర్‌ హితవు పలికారు.

వీడియో కాన్ఫరెన్సులో జెడ్పి సీ ఈ ఓ గోవింద్‌, మెప్మా పీ.డీ రాములు, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు దేవిదాస్‌, భావన్న, మురళి, ఆర్దీఓ లు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, ఏ.పీ.డి సంజీవ్‌, డీ ఏ.ఓ తిరుమల ప్రసాద్‌, డిప్యూటీ డీ ఎం హెచ్‌ ఓ తుకారాం రాథోడ్‌, డీటీడబ్ల్యుఓ నాగూరావు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »