నిజామాబాద్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశమై అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని సీఈఓ దృష్టికి తెచ్చారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు. అయితే, ఓటర్లకు కార్డులు అందాయా? లేదా? అన్నది క్షేత్ర స్థాయిలో బీ ఎల్ ఓ లచే నిర్ధారణ చేసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ సూచించారు.
కొత్తగా చేపట్టిన ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల జాబితాను సైతం క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించాలని, ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి జిల్లాలో 85 నుండి 90 శాతం ఆధార్ సీడిరగ్ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు.
కాగా, జాతీయ ఓటరు దినోత్సవం గురించి విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ‘ మై భారత్ హూ’ గేయాలాపన అనంతరం ప్రతిజ్ఞ ఉంటుందని, ఆ పై ఓటరు కార్డుల పంపిణి, ఓటర్లకు సన్మానం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్, ఆర్దీఓలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, డీసీఓ సింహాచలం, జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.