కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ఐకెపి అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసూళ్లు, సోలార్ వినియోగం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లు చెల్లించవలసిన అవసరం ఉండదని తెలిపారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. సోలార్ యూనిట్ల కోసం మహిళలను ఎంపిక చేయాలని కోరారు. ఫిబ్రవరి 10లోగా 100 శాతం బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు వసూలు చేపట్టాలని సూచించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు తేనెటీగలు, చేపలు, గేదెల, కోళ్ల, కూరగాయల పెంపకం వంటి యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా అధికారులు చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్ డిఓ సాయన్న, ఎల్డిఎం చిందం రమేష్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, డీపీఎంలు సుధాకర్, రవీందర్, అధికారులు పాల్గొన్నారు.