నిజామాబాద్, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగితే అద్భుత విజయాలు సొంతం అవుతాయని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు జడ్జి పీ.శ్రీసుధ ముందుగా ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్దకు చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కే.ఆర్.నాగరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఇదివరకు సమాజంలో మహిళల పట్ల వివక్షత నెలకొని ఉండేదని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా నేడు చాలా వరకు ఆ వివక్షత దూరం అయ్యిందని అన్నారు. ఆకాశంలో సగభాగంగా ఉన్న మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే మహిళలు వారికి కేటాయించిన బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ, విధులకు పూర్తి న్యాయం చేస్తున్నారని కలెక్టర్ కొనియాడారు.
వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఆదర్శంగా తీసుకుని, విద్యార్థినులు, యువతులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం టీ ఎస్ పీ ఎస్ సీ గ్రూప్స్ తో పాటు వివిధ శాఖలలో సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లు జారీ చేస్తోందని అన్నారు.
ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో శ్రమిస్తే తప్పనిసరిగా విజయం సాధించగల్గుతారని మార్గనిర్దేశం చేశారు. లక్ష్య సాధనకు అడ్డంకిగా నిలిచే సెల్ ఫోన్ వంటి వ్యాపకాలను పక్కనపెట్టి, పూర్తిగా లక్ష్యంపైనే గురిపెట్టాలని సూచించారు. కష్టపడి లక్ష్యాన్ని సాధించినప్పుడు దాని తాలూకు విజయం అందించే ఆనందం, అనుభూతి అనిర్వచనీయంగా ఉంటుందన్నారు. జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడేందుకు యువతకు ఇదే సరైన సమయమని, దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితబోధ చేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, అదనపు డీసీపీ అరవింద్ బాబు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, న్యాయశాఖ అధికారులు, విద్యార్థినులు, వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారిణులు పాల్గొన్నారు.