నిజామాబాద్, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాల నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో నాణ్యమైన సేవలందేలా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సీ.ఎస్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 1500 బృందాలతో చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలను సమర్ధవంతంగా నిర్వహిస్తుండడం పట్ల కలెక్టర్లు, సంబంధిత అధికారులను అభినందించారు. ఇదే స్పూర్తితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, సేవలను నిరంతరం మెరుగుపర్చుకునేలా కృషి చేయాలని సూచించారు. అవసరమైన వారికి తప్పనిసరిగా కంటి అద్దాలు అందించేలా చూడాలని, ఏ ఒక్కరి నుండి కూడా తమకు కంటి అద్దాలు అందించలేదని ఫిర్యాదు రాకుండా చూసుకోవాలన్నారు.
క్వాలిటీ కంట్రోల్ సెల్ బృందాలు అందించే నివేదికలు, ఎం.ఐ.ఎస్ రిపోర్ట్ ల ఆధారంగా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే వాటిని సవరించుకోవాలి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జిల్లా జైలు, ప్రెస్ క్లబ్ వంటి చోట్ల ప్రత్యేకంగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వైద్యారోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా స్థాయిలోని కంట్రోల్ రూమ్ ద్వారా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలిస్తూ, ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే దానిని పరిష్కరించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీ ఎం హెచ్ ఓ డాక్టర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.