ఆర్మూర్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతీ బుధవారం స్వచ్చ ఆర్మూర్ కార్యాక్రమాన్ని విధిగా నిర్వహించాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నెం.12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఆదివారం ఆర్మూర్ మునిసిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్‌లో ప్రతీ బుధవారం సాయంత్రం అంగడి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఉదయమే పట్టణాన్ని పరిశుభ్రం చేయాలని సూచించారు. మొత్తం 36 వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును సమీక్షించానని, అధికారుల పనితీరు బాగుందని ఆయన అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మిగిలిన 270 పనులు రేపటి నుంచే షురూ అవుతాయని, యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.
‘‘అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి. మన నియోజకవర్గంలో ‘‘కంటివెలుగు’’ అమలు అద్భుతం ఉంది. టార్గెట్ అధిగమించడం హర్షణీయం. కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే బెస్ట్ ఐ స్క్రీన్ టెస్ట్. ఇబ్బందులున్న వారికి అప్పటికప్పుడే రీడిరగ్ గ్లాసెస్ ఇస్తున్నాము. ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇంతటి అధ్బుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా పాదాభివందనం. ఈ పథకం అమలుకు కృషి చేస్తున్న మంత్రి హరీష్ రావుకి నా ధన్యవాదాలు’’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలావుండగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతున్న వారు ఉంటే వారికి తాను అండగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికీ 25 వేల మందికి పైగా బాధితులకు సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌వోసీ చెక్కులు ఇచ్చి మెరుగైన వైద్యం చేయించామని వెల్లడిరచారు. సీఎంఆర్‌ఎఫ్ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం తన పీఏలు, పీఆర్‌ఓలతో పటిష్టమైన వ్యవస్థ ను ఏర్పాటు చేశానని జీవన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఇంచార్జ్ కమిషనర్ మనోహర్, డీఈ భూమేశ్వర్, ఏఈ రఘు, టీపీఎస్ వినీత్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, అకౌంట్ సెక్షన్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.