బాన్సువాడ, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ బందుకు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బిజెపి నియోజకవర్గ నాయకులు మల్యాద్రి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ బందుకు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బందుకు సహకరిస్తుంటే బిజెపి నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి తుంగలో పెట్టారని పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిని కాపాడాలని ఉద్దేశంతో ఇలా అక్రమ కేసులు పెట్టి బలవంతంగా అరెస్టు చేయడం తగదన్నారు.
వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందు పాటిస్తుంటే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు వ్యవరిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తున్నారని బిజెపి నియోజకవర్గ నాయకులు మాల్యాద్రి రెడ్డి తెలిపారు. హిందూ అమ్మాయిలపై అఘత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సింది పోయి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాన్సువాడ బంద్ జరగకుండా చూడాలని అధికార పార్టీ నేతలు వ్యాపారస్తులను బందు చేస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు వేరే ఉంటాయని బెదిరించిన వ్యాపారస్తులు వెనుకడుగువేయలేదన్నారు.
ఈ సంఘటనకు కారకులైన వారిపై సమగ్రంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆస్పత్రి సూపరిండెంట్ గత కొన్ని సంవత్సరాలుగా బాన్సువాడలోనే విధులు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దుకాణాలు బందు చేయాలని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటామని ముందస్తు హెచ్చరికలు చేయడంతో కొన్ని హిందూ సంఘాల నేతలను, బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషనులకు తరలించారు.
పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం నుండి పోలీసు బలగాలు పలు చౌరస్తాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించారు. ఒక వర్గానికి చెందిన వారికి అధికార పార్టీ నాయకుల మద్దతును ప్రజలందరూ గమనిస్తున్నారని దీనికి రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని మాల్యాద్రి రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్, శంకర్ గౌడ్, వడ్ల శేఖర్, బిజెపి నాయకులు తదితరులున్నారు.