నిజామాబాద్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మోపాల్ మండలంలోని ముదక్‌పల్లి, న్యాల్కల్ గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును ఒక్కో టేబుల్ వారీగా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని దృష్టి లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు.
శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఎంరోజుకు సగటున ఎంత మంది నేత్ర పరీక్షల కోసం వస్తున్నారని కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయాలు, రవాణా వసతి గురించి వైద్య బృందాలను ఆరా తీశారు. శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. అవసరం ఉన్న వారందరికీ తప్పనిసరిగా కంటి అద్దాలు, మందులు ఇవ్వాలని అన్నారు.
అవసరం ఉన్నా, తమకు మందులు, కంటి అద్దాలు అందించలేదని ఏ ఒక్కరి నుండి కూడా ఫిర్యాదు రాకూడదని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. శిబిరాల్లో నిర్వహిస్తున్న నేత్ర పరీక్షల వివరాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా సంబంధిత సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ట్యాబ్-1, ట్యాబ్-2 వివరాలలో తేడా ఉండకూడదని జాగ్రత్తలు సూచించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పించి శిబిరాలకు తరలి వచ్చేలా చొరవ చూపాలని కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. శిబిరాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. కలెక్టర్ వెంట కంటి వెలుగు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్, తహసీల్దార్ లత, ఎంపీఓ ఇక్బాల్ తదితరులు ఉన్నారు.