నిజామాబాద్, జనవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉద్బోధించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపాల్ మండలం బోర్గం(పి) పాఠశాలలో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
బాలికలు, యువతులకు స్వీయ ఆత్మరక్షణ అవసరం అని గుర్తించిన ప్రభుత్వం, ఆయా పాఠశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిందని, నెల రోజుల పాటు శిక్షణ అందిస్తారని తెలిపారు. విద్యార్థినులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుచితంగా, అమర్యాదకరంగా ప్రవర్తిస్తే, అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు విశేషంగా తోడ్పాటును అందిస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో చక్కగా స్థిరపడాలని కలెక్టర్ హితవు పలికారు. ఏదైనా సాధించాలంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన మార్గంలో ముందుకెళ్లినప్పుడే విజయం వరిస్తుందని, లక్ష్య సాధనకు అడ్డదారులు ఉండవని అన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చక్కగా చదువుకుంటే, జీవితమంతా సుఖ సంతోషాలతో కూడి ఉంటుందని, చదువును అశ్రద్ధ చేస్తే జీవితాంతం కష్టాలను ఎదుర్కొనే పరిస్థితికి తావు కల్పించినట్లు అవుతుందన్నారు.
ప్రతిభ కలిగి ఉన్న వారు పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ కొలువులు సంపాదిస్తున్నారని, ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రతిభావంతులైన వారికి సాలీనా కోటి రూపాయల జీతం అందిస్తున్నాయని అన్నారు. అలాంటి ఆదర్శవంతులైన వారి జాబితాలో తాము కూడా చేరుతామనే గట్టి సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని హితవు పలికారు. బాలికల పట్ల నేటి ఆధునిక సమాజంలోనూ అక్కడక్కడా ఇంకనూ వివక్ష నెలకొని ఉండడం దురదృష్టకరం అన్నారు.
బాలికలు తమ ప్రతిభకు పదును పెడుతూ ఏ విషయంలోనూ ఎవరికీ తీసిపోమనే విషయాన్ని చాటి చెప్పాలన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలకు చక్కగా సన్నద్ధం అయ్యి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. స్వీయ ఆత్మరక్షణ కోసం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆత్మస్థైర్యం పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే బాలికలకు అవసరమైన యూనిఫామ్, 8, 9వ తరగతుల విద్యార్థినులకు షూస్, సాక్స్ సమకూరుస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యా బోధనతో ప్రత్యేకతను చాటుకుంటున్న బోర్గం(పి) హై స్కూల్ అంటే తనకెంతో అభిమానమని, పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తప్పనిసరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆలపించిన గేయాలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ రావు, జీసీడీఓ లలిత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్, పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు మల్లెపూల నవీన్, బైస సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.