నిరంతర అభివృద్ది, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే. తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించారు. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన కంటేశ్వర్‌ కమాన్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. పాత కలెక్టరేట్‌ వద్ద రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఇందూరు కళాభారతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన కాకతీయ సాండ్‌ బాక్స్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

ఇందూరు కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో నిజామాబాద్‌ జిల్లా ముందువరుసలో నిలుస్తూ యావత్‌ తెలంగాణకు మార్గదర్శకంగా నిలిచిందని గుర్తు చేశారు. అందుకే నిజామాబాద్‌ జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ప్రత్యేకమైన అభిమానమని అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవలే సమీక్ష నిర్వహించారని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని అన్నారు. ఇందులో భాగంగానే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, బాలలు, అన్ని వర్గాల ప్రజలకు చక్కటి కానుక అందించేలా ఇందూరు కళాభారతి నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా అన్ని హంగులు, అధునాతన వసతులతో అలరారేలా కళాభారతి డిజైన్‌ రూపొందించడం జరిగిందన్నారు.

గడిచిన ఎనిమిదిన్నరేళ్ల కాలంలో ఒక్క నిజామాబాద్‌ నగర అభివృద్ధికే ప్రభుత్వం రూ.936 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకనూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అనేకం ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మరో నెలన్నర రోజుల్లో పూర్తి కానున్న ఐ.టీ హబ్‌ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసేందుకు తాను మళ్ళీ నిజామాబాద్‌లో పర్యటిస్తానని అన్నారు.

మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపేందుకు శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖా మంత్రి కే. తారకరామారావు కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్‌ ద్వారా ఉదయం 9.30 గంటలకు మంత్రి కేటీఆర్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్నారు.

రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ నియోజకవర్గాల శాసనసభ్యులు జీవన్‌ రెడ్డి, షకీల్‌ ఆమీర్‌ మంత్రి కేటీఆర్‌ తో కలిసి హైదరాబాద్‌ నుండి హెలికాప్టర్‌ లో వచ్చారు. హెలిప్యాడ్‌ వద్ద రాజ్యసభ సభ్యులు కే.ఆర్‌.సురేష్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌ రావు, వి.గంగాధర్‌ గౌడ్‌, రాష్ట్ర మహిళా సహకార సంస్థ చైర్‌ పర్సన్‌ ఆకుల లలిత, మేయర్‌ దండు నీతూకిరణ్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌ లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, మార్కుఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌ తదితరులు కేటీఆర్‌ ను కలిసి పూల మొక్కలు, బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు.

భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ సాండ్‌ బాక్స్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగింది.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »