శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ శివారులోని తాడ్కోల్ వద్ద కెసిఆర్ నగర్ పిఎస్‌ఆర్ కాలనీ’’ ఫేజ్ – 2 లో రూ. 29.41 కోట్లతో నూతనంగా నిర్మించిన 504 డబుల్ బెడ్ రూం ఇళ్ళను శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. రూ. 90 లక్షలతో నిర్మించే సాంస్కృతిక కళ్యాణ వేదిక, భోజనశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ. బి. శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి.అంజిరెడ్డి, ఆర్‌డివో రాజాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ పథకం దేశానికే ఆదర్శమని, ఇల్లు లేని పేదలకు స్వంత నివాసం ఉండాలనే మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 100 శాతం సబ్సిడీతో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పేదలకు అందిస్తున్నారన్నారు.
పేదలకు స్వంత ఇంటి నిర్మాణం కోసం గతంలో అంజయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రూ. 400, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రూ. 1000, ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రూ. 6000, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.40,000, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రూ. 70,000 ఇచ్చేవారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 5.04 లక్షలు అయిందని పేర్కొన్నారు.
గతంలో రూ. 70,000లలో సగం మాఫీ, సగం భాకీ, కానీ నేడు మొత్తం రూ. 5.04 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 ఇండ్లు మంజూరైనాయని, ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
బహుశా దేశంలో ఇంత ఎక్కువ ఇండ్లు మంజూరైన నియోజకవర్గం బాన్సువాడ నియోజకవర్గం మాత్రమేనని, ఇప్పటికే 7,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు అయ్యాయని, మిగతా ఇళ్ళ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు.
జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు, నీడ అవసరమని, బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే తన లక్ష్యమన్నారు. 2002 లో సంగమేశ్వర కాలనీలో 70 ఎకరాలు, బీడీ వర్కర్స్ కాలనీలో 30 ఎకరాలు కొనుగోలు చేసి ఇంటి స్థలం లేని వారికి పంపిణీ చేశామని, తాడ్కోల్ శివారులోని 36 ఎకరాల స్థలం ప్రభుత్వం తరుపున అప్పుడే కొనుగోలు చేశామన్నారు.
ఇప్పుడు కట్టిన 1000 ఇళ్ళు ఇందులో 28 ఎకరాల స్థలంలో కట్టినవి, డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టడంతో పాటుగా ఈ కాలనీలో ఉండేవారు ఆనందంగా, సుఖంగా ఉండటానికి అవసరమైన మౌళిక వసతులు త్రాగునీరు, కరెంటు, సిసి రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించామని స్పీకర్ చెప్పారు. భవిష్యత్తులో మిగతా స్థలంలో కూడా ఇళ్ళను నిర్మించడానికి కృషి చేస్తామన్నారు. అప్పుడు ఈ కాలనీలో మొత్తం 2000 ఇండ్లు అవుతాయని, ఈ కాలనీ హైదరాబాద్ లో ఉండే గేటెడ్ కమ్యూనిటీ వలే ఉంటుందని, చుట్టూ ప్రహారి గోడ నిర్మించి గేట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ కాలనీలోని అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇస్తామని, రాత్రి 9 గంటల తరువాత ఇతరులకు ప్రవేశం ఉండదన్నారు. ఇక్కడ ఇస్తున్న ఒక్కో ఇంటి విలువ రూ. 20 లక్షలు ఇన్ని వందల కోట్ల విలువైన ఇళ్ళను మంజూరు చేసిన ముఖ్యమంత్రిపై కృతజ్ఞతతో ఈ కాలనీకి కెసిఆర్ నగర్ అని పేరు పెట్టామన్నారు. ఎంతో కష్టపడి శ్రమ కోరిస్తే తప్ప ఇది సాధ్యం కాలేదని, స్వంత ఇల్లు లేని పేదలకే 2 బిహెచ్‌ఎస్ మంజూరు చేస్తున్నామన్నారు.
బాగా ఎంక్వైరి చేసి అర్హులకు మాత్రమే ఇళ్ళను మంజూరు చేస్తున్నామని, డబ్బులు ఇస్తే పైరవీలు చేసి ఇళ్ళు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు చెబితే నమ్మవద్దని పేర్కొన్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే వాళ్ళ ఇళ్ళు క్యాన్సిల్ చేస్తానని, లబ్ధిదారులు వేరేవారికి ఇళ్ళు అమ్మితే రద్దు చేస్తామన్నారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. తాడ్కోల్ చౌరస్తా నుండి కాలనీకీ రూ. 80 లక్షలతో డబుల్ రోడ్ నిర్మిస్తామని, మీరు ఈ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శాంతిభద్రతల కోసం పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు చేస్తామని, పచ్చదనం కోసం లబ్ధిదారులు ప్రతి ఇంటి ముందు మొక్కలను పెంచుకోవాలన్నారు.