కామారెడ్డి, జనవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల చోదకులు నిబంధనల ప్రకారం స్పీడులో వెళ్లాలని తెలిపారు. అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే వీలుందని చెప్పారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి , ప్రమాదాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. దగ్గి, సదాశివనగర్ దర్గా సమీపంలో ఉన్న సర్వీస్ రోడ్లను బీటీ రోడ్లు మార్చాలని సూచించారు.
ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై ఆర్ అండ్ బి , పోలీస్, నేషనల్ హైవే, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, కామారెడ్డి డి.ఎస్.పి సోమనాథం, నేషనల్ హైవే, ఆర్‌అండ్‌బి అధికారులు, విద్యా, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.