కామారెడ్డి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయించి వాటి జనాభాను మున్సిపల్ అధికారులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా జంతు సంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
మున్సిపల్ అధికారులు పట్టుకున్న పశువులు ఉంచేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని తెలిపారు. గోశాలల్లోని పేడను ఉపయోగించి గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోశాలకు కావలసిన వసతులు, మందులను పశు వైద్యాధికారులు ఇవ్వాలని కలెక్టర్ కోరారు.
సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్టీవో వాణి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ భరత్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య,పశు వైద్యాధికారులు సంజయ్, భాస్కర్, దేవేందర్, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.