పోడు పట్టాలను సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జనవరి 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు సంబంధించిన తుది దశ ప్రక్రియలను తక్షణమే పూర్తి చేయాలని, ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టాలను సిద్ధం చేసుకుని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. సోమవారం సాయంత్రం ఆయా జిల్లాల కలెక్టర్లతో పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు – మన బడి, ఆయిల్‌ పామ్‌ సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై సీ.ఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు.

పోడు భూములకు సంబంధించిన సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. అటవీ ప్రాంత పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారానికి సాహసోపేత నిర్ణయం తీసుకుందని మంత్రులు గుర్తు చేశారు. ప్రభుత్వ అభిమతం మేరకు పోడు భూముల పై ఆధారపడి జీవనాలు సాగిస్తున్న అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని, అదే సమయంలో ఇకపై అటవీ ప్రాంతాల ఆక్రమణ, చెట్ల నరికివేతకు ఏమాత్రం ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, ఇప్పటికే పోడు భూములకు సంబంధించిన కసరత్తు దాదాపుగా తుదిదశకు చేరినందున, ప్రస్తుత ఫిబ్రవరి మాసంలోనే అర్హులైన వారికి ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి క్లెయిమ్‌ ను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.

గ్రామ సభల తీర్మానాలు, సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటూ, స్పష్టమైన ఆధారాలను పొందుపరుస్తూ క్లెయిమ్‌ లను ఆమోదించాలని, నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించాలని తెలిపారు. పోడు పట్టాల ముద్రణలో అక్షర దోషాలు, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని నిశితంగా పర్యవేక్షణ చేయాలని, ఆన్లైన్‌లో వివరాల నమోదులో తప్పులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రతి శనివారం డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ అందించాలని సీ.ఎస్‌ సూచించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్న వైద్య బృందాలకు మెరుగైన వసతులతో కూడిన సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. కాగా, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఖాళీలు, సీనియారిటీ జాబితాకు సంబంధించి వచ్చే అభ్యంతరాలను వెంటదివెంట పరిష్కరించాలని సూచించారు. ఉపాధ్యాయుల సౌకర్యార్థం అవసరమైతే ప్రత్యేకంగా సదరం క్యాంప్‌ లను ఏర్పాటు చేయించాలని అన్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసిన మీదట, విద్యా సంవత్సరం ముగిసిన తరువాతనే వాటికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం విద్యా సంవత్సరం చివరి దశకు చేరి, వార్షిక పరీక్షలు సమీపించినందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కాగా, మన ఊరు – మన బడి కార్యక్రమం కింద పనులన్నీ పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 01 తేదీన మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రారంభోత్సవాలకు ఎంపిక చేసిన బడులలో ఏ చిన్న పని కూడా అసంపూర్తిగా ఉండకుండా చూసుకోవాలని, పండగ వాతావరణంలో ప్రారంభోత్సవాలు జరగాలన్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగుపై సమీక్ష జరుపుతూ, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పంట సాగయ్యేలా చొరవ చూపాలని సీ.ఎస్‌ సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పందిస్తూ, జిల్లాలో మొత్తం ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టాలని లక్ష్యం కాగా, ఇప్పటికే 2316 ఎకరాల్లో పంట సాగు ప్రారంభం అయ్యిందని, మరో 1460 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి రైతులు ముందుకు వచ్చి డీ.డీ లు చెల్లించారని సీ.ఎస్‌ దృష్టికి తెచ్చారు.

ప్రస్తుతం ఎర్రజొన్న, మొక్కజొన్న తదితర పంటలు తుది దశలో ఉన్నాయని, కోతలు పూర్తి కాగానే ఆయిల్‌ పామ్‌ పంట సాగు విస్తీర్ణం పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎం.పీ.పీలు, జెడ్పిటీసీలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాములను చేస్తూ, ఆయిల్‌ పామ్‌ సాగు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృత స్థాయిలో అవగానే కల్పిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలో పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌ పంట సాగయ్యేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, డీ.ఎఫ్‌.ఓ వికాస్‌ మీనా, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శన్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌, డీ.ఏ.ఓ తిరుమల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Blog heading and website banner of laptop with female typing hands, copy space in grey color. Concept of advertisement of bitcoin and cryptocurrency, modern technology and programming.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »