కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా రైతులు చేపల పెంపకంపై దృష్టి సారించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం మోడేగామ, భూంపల్లి గ్రామాల్లో మంగళవారం ఫిష్ పాండ్‌లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతి గ్రామంలోని మహిళా సంఘాల నుంచి పదిమంది మహిళా రైతులను ఐకెపి అధికారులు గుర్తించి, చేపల పెంపకం చేపట్టే విధంగా చూడాలన్నారు. తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు పొందే వీలుందని సూచించారు. మహిళలు చేపల పెంపకానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. బ్యాంకు లింకేజీ రుణాలు చేపల పెంపకానికి వినియోగించుకోవచ్చని తెలిపారు.
చేపలు పెంచే మహిళా రైతులు ప్రతిరోజు నాలుగు సార్లు వాటికి దాణ వేస్తే సరిపోతుందని చెప్పారు. నాలుగు నెలల్లో చేపలు బరువు పెరిగి ఆదాయం వచ్చే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. చేపల పెంపకం ద్వారా మహిళా రైతులు ఆర్థికంగా స్వాలంబన సాధించవచ్చునని చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎంపీపీ అనసూయ, మండల రైతు బంధు అధ్యక్షుడు భూంరెడ్డి, డీపీఎంలు రవీందర్రావు, రమేష్ బాబు, ఏపీఎం రాజిరెడ్డి, సమన్వయకర్తలు రాములు, ఆంజనేయులు, అబ్బ లింగం, నరేందర్ రెడ్డి, కృష్ణాంజలి, సౌజన్య, పర్యవేక్షకురాలు లత, మహిళలు పాల్గొన్నారు.