ఎడపల్లి, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు.
రథోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో వెలసిన దుకాణ సముదాయాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. శనివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు భజన పోటీలు కొనసాగాయి. భజన పోటీల్లో గెలుపొందిన వారికి శాలువలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై పాండేరావు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే భక్తులకు జాన్కంపేట్ గ్రామానికి చెందిన పురం అబ్బయ్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అలాగే ఆలయం వద్ద భక్తుల దాహర్తిని తీర్చేందుకు జాన్కంపేట్ గ్రామానికి చెందిన నవీన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయిలు, ఎంపీటీసీ మంద సంజీవ్, ఉపసర్పంచ్ విజయ్, మాజీ సర్పంచ్ దశరథ్, ఆలయ మాజీ చైర్మన్ విజయ్ గౌడ్, పోచారం సర్పంచ్ ఇంద్రకరణ్, గ్రామస్తులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
సోమవారం ముగియనున్న బ్రహ్మోత్సవాలు….
గత వారం రోజుల నుండి కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగియనున్నాయి.చివరి రోజు స్వామివారికి చక్ర స్నానం (చక్రతీర్థం) నిర్వహిస్తారు.ఈ మేరకు కొనసాగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ సిబ్బంది తెలిపారు. సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహిస్తారు.