నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను నివారించాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన శిబిరంతో పాటు, యానాంపల్లి తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేశారు. శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.
నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు, కంటి అద్దాలు, మందులు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. పక్కనే గల నర్సరీలో మొక్కలు పెంచేందుకు చేసిన ఏర్పాట్లను గమనించిన కలెక్టర్, ఎంపిడిఓకు పలు సూచనలు చేశారు. మొక్కలు నాటే సమయానికి తగిన ఎత్తుతో కూడిన వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉండేలా సరైన ప్రణాళికతో నర్సరీల్లో మొక్కలు పెంచేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
మన ఊరు – మన బడి పనులు తనిఖీ
కాగా, డిచ్పల్లి మండలం రాజారామ్ నగర్ లో గల మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు -మన బడి కింద చేపట్టిన పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం తనిఖీ చేశారు. ఇంకనూ తుది దిశగా మిగిలి ఉన్న పనులను కూడా నాణ్యతతో చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పాఠశాల ఆవరణను చక్కగా చదును చేసి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.
పాఠశాలలో ఎన్ని తరగతులు కొనసాగుతున్నాయి, విద్యార్థుల సంఖ్య, ఎంత మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు, వివిధ పనుల కోసం మంజూరైన నిధులు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, గోవర్ధన్, ఎంపీడీఓ గోపి, తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.