డిచ్‌పల్లి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – 2020: ఇంప్లికేషన్స్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్’’ అనే అంశపై వెబినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన విద్యావిధానం మార్గదర్శకాలను నివేదించారు.
మంచి మానవ సంబంధాలను వృద్ధి పరచడం, మేధో పరమైన ఆలోచనా విధానం, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక అభివ్యక్తి, నైతిక నిలువలు, సమైక్యతా భావన వంటివి ఈ విద్యావిధానం ద్వారా పెంపొందుతాయన్నారు. వెబినార్ నిర్వాహకులను అభినందించారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రొ. ఎస్. లింగమూర్తి హాజరై నూతన విద్యావిధానం ద్వారా శాస్త్ర సాంకేతికతను, అదేస్థాయిలో సంప్రదాయక వృత్తి విద్యా కోర్సులను వృద్ది పరచవచ్చన్నారు.
రిజిస్ట్రార్ ఆచార్య నసీం, డీన్ ఫాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ ఆచార్య ఎం.యాదగిరి, ప్రిన్సిపల్ డా.వాసం చంద్రశేఖర్, వెబినార్ డైరెక్టర్ డా. జి. రాంబాబు, అసిస్టెంట్ డైరెక్టర్స్ డా. శ్రీనివాస్, డా. గంగాధర్, డా.శ్వేత పాల్గొని మాట్లాడారు.