నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నుండి వారి జీవనానికి సరిపడా పెన్షన్ ఇవ్వాల్సిన 700 నుంచి రూ. 1000 లోపు పెన్షన్ చెల్లిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, కనీస పెన్షన్ 5 వేలకు పెంచాలని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సామల మల్లేష్ డిమాండ్ చేశారు.
మంగళవారం ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఫెడరేషన్ ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సామల మల్లేశం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాదిమంది బీడీ కార్మికులు బీడి పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నారని, వారి శ్రమ ద్వారా పన్నుల రూపంలో వందల కోట్లు వసూలు చేస్తున్నాయన్నారు.
ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు చేయకపోగా కార్మికులు జమ చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పిఎఫ్ కలిగిన బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు 2014 కంటే ముందు వారికి మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్ పీఎఫ్ కలిగిన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చినా రాష్ట్రంలో నేటికీ అమలు జరగడం లేదన్నారు.
బీడీ యాజమాన్యాలు నెలకు 26 రోజులు పని కల్పించాలని పోరాడుతున్న కల్పించకపోగా వర్ధి బీడీని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, వీటి పరిష్కారం కోసం కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య, రాష్ట్ర కోశాధికారి గోవర్ధన్, నాయకులు ముక్రం, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సజ్జన భానుచందర్, జిల్లా నాయకులు రఫీ ఖాన్, చింతకింద మల్లేష్, ఆడెపు గంగాధర్, మల్లు బాయ్, కోవ లక్ష్మి, పట్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.