ఇందూరు వాసులకు మరిన్ని ఆధునిక సదుపాయాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర ప్రజలకు త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవగాంధీ హనుమంతు, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (న్యూ కలెక్టరేట్‌) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐ.టీ హబ్‌ ను సందర్శించి, పనుల ప్రగతి గురించి అధికారులు, కాంట్రాక్టర్‌ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను వేగవంతంగా చేపడుతూ, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యానికి ఎంతమాత్రం తావులేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకుని ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.

అనంతరం ఐ.టీ హబ్‌ కు చేరువలో నిర్మిస్తున్న దుబ్బ వైకుంఠధామం పనులను, నగర పాలక సంస్థ నూతన భవన సముదాయాన్ని, ఖలీల్‌ వాడి, అహ్మదిబజార్‌ సమీకృత వెజ్‌-నాన్వెజ్‌ మార్కెట్‌ యార్డులు, కోటగల్లి, ఖిల్లా, అర్సపల్లి వైకుంఠ ధామాల పనులను, రఘునాథ చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను ఎమ్మెల్యే, కలెక్టర్‌ పరిశీలించారు. నిధులు అందుబాటులో ఉన్నందున పనులను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా కృషి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదార్లకు సూచించారు.

మరో నెలన్నర రోజుల్లోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ప్రతి చోటా పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రారంభోత్సవాలు నాటికి ఏ చిన్న పని కూడా పెండిరగ్‌ ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా మాట్లాడుతూ, కోట్లాది రూపాయల వ్యయంతో నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వచ్చే మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయని, రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే.తారకరామారావు చేతుల మీదుగా ప్రాంరంభోత్సవాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పై పనులు పూర్తయిన మీదట నగర ప్రజలకు అధునాతన వసతులతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.

నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారికి అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. వీరి వెంట వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »